తుఫాన్ సమీక్ష

Ramcharan

ఉపోద్ఘాతం:

పునీత్ రాజ్ కుమార్ తెలుగు లోకి వచ్చి, మన ఖైదీ రీమేక్ చేస్తే ఆహా..మన చిరంజీవి సినిమా రీమేక్ చేస్తున్నడు కదా అని మెగా ఫ్యాన్స్ అందరూ చొక్కాలు చించేసుకుని ఆ సినిమా చూడటానికి ఎగబడతారా?? ఎవరో పునీత్ రాజ్ కుమార్ అని కన్నడ లో చాలా పెద్ద స్టార్ ఇక్కడికి వచ్చి మన ఖైదీ రీమేక్ చేస్తున్నాడంట కదా అని ‘ఖైదీ’ అభిమానులందరూ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఈ సినిమా కోసం ఎదురు చూస్తారా?? చిరంజీవి కి మొదటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖైదీ. చిరంజీవి కి తిరుగు లేని యాక్షన్ హీరో ఇమేజ్ తెచ్చిన ఖైదీ ని మళ్ళీ తెలుగులో రీమేక్ చేస్తున్నాడు కాబట్టి, పునీత్ రాజ్ కుమార్ కి కూడా తక్షణమే తెలుగులో అంతటి యాక్షన్ హీరో ఇమేజ్ ఇచ్చేద్దామని తెలుగు ప్రేక్షకులందరూ ముక్త కంఠం తో తీర్మానించేసుకుంటారా??

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మీకు తెలుసు. సరే, సమీక్ష లో కి వెళదాం.

(ఇప్పటికే అందరికీ తెలిసిన) కథ:

హీరో ACP విజయ్ ఖన్నా, నిజాయితీపరుడు, 5 యేళ్ళలో 22 ట్రాన్స్ఫర్లు. హీరోయిన్ మాల ఒక మర్డర్ చూస్తుంది. సాక్ష్యం చెప్పడానికి సిద్దపడుతుంది. అప్పుడు ఆమెకి రక్షణ కల్పించడానికి హీరో ఆమెని తనింట్లోనే పెట్టుకుంటాడు (అబ్బే, రాజశేఖర్ అంకుశం సమీక్ష కాదు, రాం చరణ్ తుఫాన్ సమీక్షే!). ఇక షేర్ ఖాన్ అనే లోకల్ దాదా సహాయం తో దీని వెనక ఉన్నది ఆయిల్ మాఫియా డాన్ తేజ అని తెలుసుకుంటాడు హీరో. ఇక ఆ డాన్ తో తలపడి హీరో ఎలా విజయం సాధిస్తాడు అనేదే మిగతా కథ.

విశ్లేషణ:

అందరికీ తెలిసిన ఈ కథ ని మళ్ళీ తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉండాలి. జంజీర్ ఫార్మేట్ లోనే కథ జరుగుతూనే ప్రేక్షకుల స్థాయి కి అందని ఒకట్రెండు ట్విస్ట్లు ఉంటే, సినిమా కాస్తయినా ప్రేక్షకున్ని కూర్చోబెడుతుంది. షారుఖ్ ఖాన్ డాన్ రీమేక్ చేసినప్పుడు, ఒరిజినల్ లోని పోలీస్ ఆఫీసర్ కేరక్టర్ కి ఇంటర్వల్ ముందు ఒక ట్విస్ట్ ఇస్తారు. ఇక చివర్లో క్లైమాక్స్ లో ఎవ్వరూ ఊహించని ఇంకొక ట్విస్ట్ ఇస్తారు. వీటికి తోడు సినిమా చాలా గ్రాండ్ గా..రిచ్ గా తీయడం ద్వారా డాన్ కి సమకాలీనత తీసుకొచ్చారు. కానీ జంజీర్(తుఫాన్) లో ఏం జరిగింది. కొత్తగా ఒక ఆయిల్ మాఫియా త్రెడ్, ఒక జర్నలిస్ట్ త్రెడ్ జతచేసారు. పోనీ అదైనా సరిగ్గా తీశారా అంటే – అంతోటి ఆయిల మాఫియా ని హీరో ఎలా ధ్వంసం చేస్తాడనుకున్నారు? గొప్ప పోలీస్ పవర్ తోనా? భీబత్సమైన మైండ్ గేం తో నా? కాదండీ బాబు, ఒక కార్ వేసుకుని ఆయిల్ మాఫియా ని కల్తీ చేసే స్లంస్ లోకి దూసుకెళ్ళి వాటన్నిటినీ ఢీకొట్టేసి, అవన్నీ పేలిపోయేలా చేసి, విలన్ కి ఒక 600 కోట్లు నష్టం తెప్పిస్తాడు. అలాగన్న మాట. సరే, ఆయిల్ మాఫియా ని వదిలేద్దాం..మర్డర్ ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా మెరుపులు చూపించారా దర్శక రచయితలు అంటే, అదీ ఉండదు. మర్డర్ చూసిన హీరోయిన్ గుర్తులు చెబితే, దాన్ని స్కెచ్ గీయించి షేర్ ఖాన్ కి చూపిస్తాడు హీరో. షేర్ ఖాన్ ఠకీమని వాణ్ణి గుర్తు పట్టేస్తాడు.అయిపోయింది ఇన్వెస్టిగేషన్. ఇక జర్నలిస్ట్ పాత్ర. పాత్ర పరిచయం, హీరో తో ఒక కంఫ్రంటేషన్ సీన్, హీరో కి ఒక ఇంఫర్మేషన్ ఇచ్చే సీన్, విలన్ తో ఒక కంఫ్రంటేషన్ సీన్, ఆ తర్వాత చనిపోవడం. ఇంతే ఆ పాత్ర.

విద్యా బాలన్ “కహానీ” కి కథ అందించిన రచయితే జంజీర్ కి కథ అందించాడని అంటే, పాత కథ కి ఏదో ఒక మినిమం ట్విస్ట్ ఇచ్చే ఉంటాడని ఆశించా. చిరంజీవి జంజీర్ యాక్షన్ సన్నివేశాలు అద్దిరిపోయాయని పదే పదే చెబుతుంటే..లేటేస్ట్ గా వచ్చిన బాలీవుడ్ సినిమాల స్థాయి కంటే చాలా గొప్పగా ఇందులో యాక్షన్ ఉంటుందని ఊహించా. అపూర్వ లఖియా హాలీవుడ్ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడని అంటే, మరీ ఆ స్థాయి కాకపోయినా, ఓ రేంజ్ టేకింగ్ ఉంటుందని భావించా. కానీ ఇందులో అవేవీ లేవు. కానీ ఒక్క విషయం చెప్పుకోవాలి. స్క్రీన్ ప్లే చాలా ‘క్రిస్ప్’ గా ఉంది. అంటే, హీరో ఇంట్రడక్షన్, ఫైట్, ఆ వెంటనే హీరోయిన్ ఇంట్రడక్షన్, పాట, ఆ వెంటనే హీరోయిన్ మర్డర్ చూడటం, ఆ వెంటనే షేర్ ఖాన్ ఇంట్రడక్షన్, హీరో కి షేర్ ఖాన్ కి ఫైట్. ఇలా కథ కి అవసరం లేని సన్నివేశాలు ఏవీ లేకుండా చకచకా కథ ముందుకి కదులుతుంది. నిజానికి అది సినిమా కి ప్లస్సవ్వాలి. కానీ ఆ ‘చకచకా’ కదుకుతున్న సన్నివేశాలన్నీ కూడా ప్రేస్ఖకులకి ఆల్రెడీ తెలిసినవే కావడం తో వాళ్ళ బుర్ర కూడా అంతకంటే ‘చకచకా’ కథ లో తర్వాత ఏం జరుగుతుందో ఊహించేస్తుంది. అదీ ప్రాబ్లెం. ఇక దాదాపు గంట 20 నిమిషాలు ఫస్త్ హాఫ్ అయితే, కేవలం 50 నిమిషాల్లో సెకండాఫ్ అయిపోతుంది. దీనివల్ల సినిమా అబ్రప్ట్ గా ఎండ్ అయినట్టనిపిస్తుంది.

ఇక నటీనటుల గురించి. రాం చరణ్ నిజానికి తనవంతు బాగానే చేసాడు. అయితే ఒరిజినల్ జంజీర్ తో దీన్ని పోల్చకూడదు. నిజానికి NTR నిప్పు లాంటి మనిషి అనే పేరుతో జంజీర్ ని ఆ రోజుల్లో రీమేక్ చేసినపుడే, అమితాబ్ స్థాయిలో NTR నటన లేదని అన్నారు ఆరోజుల్లో. ఒక్కో నటుడికి ఒక్కో స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. అమితాబ్ పౌరాణిక పాత్రల్లో NTR ఛాయల్లోకి రాలేకపోవచ్చు, కానీ NTR కూడా అమితాబ్ స్థాయి లో “యాంగ్రీ యంగ్ మేన్” అనిపించుకోలేకపోయాడు. రాం చరన్ కూడా సినిమా మొత్తం ‘కన్సిస్టెంట్’ గా ఒకే తరహా బాడీ లంగ్వేజ్ ప్రదర్శించగలిగాడు. షేర్ ఖాన్ పేరు శ్రీహరి కి కలిసి వచ్చింది. బాగా చేశాడు. ప్రియాంక చోప్రా బానే చేసింది కానీ అక్కడక్కడా ఓవరాక్షన్ అనిపించింది. ఇక ప్రకాశ్ రాజ్. ఆయన బాగానే చేసినా ఆయన పాత్రని డిజైన్ చేసిన విధానం లో నే ఏదో లోపముంది.

చివరగా:

సరే, ఎక్కడ మొదలెట్టామో, అక్కడే ముగిద్దాం (హి హి, కరెక్టే, త్రివిక్రం డైలాగే!). పునీత్ రాజ్ కుమార్ తెలుగు లో హిట్ కొట్టాలంటే ఏమి చేయాలి. ఖైదీ రీమేక్ చేసి, నేనూ కన్నడలో మీ చిరంజీవి స్థాయి నటుణ్ణే అని చెప్పాలని చూస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరించే అవకాశం కంటే తిరస్కరించే అవకాశమే ఎక్కువ. కాబట్టి తను చేయాల్సింది ఏంటంటే – ఇక్కడ తెలుగు ప్రేక్షకుల అభిరుచి కి తగ్గట్టు ఉన్న కథ ని తీసుకుంటే ముందు కనీసం ఒక హిట్టు తగులుతుంది. ఉదాహరణకి ఆ మధ్య వచ్చిన “ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమా లో హీరో పేరు ఇప్పటికీ తెలుగులో చాలా మందికి తెలీదు, కానీ తనని చూస్తే “ఓహ్, ఫలానా సినిమా హీరో” అని చాలా మంది గుర్తు పడతారు. అలా ఒక హిట్టు కొట్టి తన ఫేస్ రిజిస్టర్ అయ్యేలా చేసిన తర్వాత ఒకటి రెండు మంచి కథాబలమున్న చిత్రాల్లో పాత్రకి అనుగుణంగా నటిస్తూ పోతే, నెమ్మది గా ఒక ఇమేజ్ వస్తుంది. అంతే కానీ, డైరెక్ట్ గా ఖైదీ కావాలంటే కష్టం. మరీ..షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, అమితాబ్ సినిమాలని రీమేక్ చేసారుగా, రాం చరణ్ మాత్రం ఎందుకు చేయకూడదూ అనంటారేమో..మరీ, ఖైదీ రీమేక్ ని ఏ పవన్ కళ్యాణొ, మహేష్ బాబో చెయ్యడానికీ, పునీత్ రాజ్ కుమార్ చేయడనికీ తేడా ఉండలా..ఇదీ అంతే!

కొసమెరుపు:

ఈ మధ్య మెగా ఫ్యామిలీ కి సంబంధించిన చాలా సినిమాల ఆడియో ఫంక్షన్లలో చిరంజీవి మాట్లాడిన మాటలనిబట్టి సినిమా హిట్టా ఫట్టా అనె గెస్ చేస్తూ గతం లో కొన్ని పోస్ట్స్ వేశాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ చిరంజీవి ఒక మెగా ఆడియో ఫంక్షన్ ని స్కిప్ కొట్టడం తో ఆ రోజే సినిమా మీద ఏర్పడ్డ అనుమానాలన్నీ సినిమా చూసాక నిజమయ్యాయనిపించింది.

source: Click Here

Filed Under: Hari Reviews