ప్రియమైన క్రిష్‌కి

mohan-krishna-indraganti

తెలుగు సినిమాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. సినిమాలో కంటెంట్ కంటే సినిమాల పబ్లిసిటీ పెరిగింది. సెలబ్రీటీలు అందరూ ట్వీటర్, ఫేస్‌బుక్‌ల్లో చేరి సినిమాను పబ్లిసిటీ చెయ్యడం కంటే హైప్ చెయ్యడం ఎక్కువ పనిగా పెట్టుకున్నారు. కంచె విషయంలో అలా చేయలేకపొయారు. దానికితోడు సినిమా రిలీజ్ అనుకున్న ప్రకారం చేయలేదు. వెనక్కి ముందుకు జరగడంతో సినిమాను హైప్ చేయలేకపొయారు.

మంచి సినిమాకు స్లోగా అయినా ప్రేక్షకాదరణతో పాటు మంచి స్పందన ఎప్పుడూ వుంటుంది. సెలబ్రేటీస్ కూడా ఒక్కరొక్కరూ స్పందించటం మొదలు పెట్టారు. కంచె సినిమాలో హిరో హిరోయిన్లు ఉత్తరాలు వ్రాసుకునే విధానాన్ని అనుకరిస్తూ అష్టాచమ్మా ఫేం దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ , కంచె దర్శకుడు కిష్‌కు ఓపెన్ లెటర్ వ్రాయడం చాలా బాగుంది.

ప్రియమైన క్రిష్‌కి,

సినిమా అనేది ఓ క‌ళాకారుడి వ్య‌క్తిగ‌త క‌ళాత్మ‌క ప్ర‌క‌ట‌న అనే ఆలోచ‌న పోయి ర‌క‌ర‌కాల విక్రుత‌మైన అర్ధ‌ర‌హిత‌మైన వ్యాపార విలువ‌ల క‌ల‌గూర‌ గంప అనే ధోర‌ణి ప్ర‌బ‌లంగా ఉన్న ఈ రోజుల్లో మీ కంచె ఓ ఉద్వేగ‌భ‌రిత‌మైన క‌విత‌లా హ్రుద‌యాన్ని తాకింది. సినిమాకి వ‌చ్చే ప్రేక్ష‌కుడు వినోదం పేరిట ఓ ఇర‌వై జోకుల‌కి న‌వ్వుకుని ఓ నాలుగు ఫైట్ల‌కి ర‌క్త‌పోటు పెంచుకుని ఓ ఆరు పాట‌ల‌కి అల‌సిపోయి వెర్రి మొహంతో ఇంటికి చేరుకునే ఈరోజుల్లో ఉత్తేజంతో, ఆశ‌తో, ఉద్వేగంతో ఆనందంగా థియేట‌ర్ లోంచి బ‌య‌ట‌కి రావ‌డం చాలా రోజుల త‌ర్వాత కంచె త‌రువాతే జ‌రిగింది.

మీ మాన‌వ‌తా ద్రుష్టి, మీకు సినిమా క‌ళ ప‌ట్ల ఉన్న నిబ‌ద్ద‌త మీ క‌ళాత్మ‌క ఆద‌ర్శం ఈ రోజుల్లో ఎంతైనా అవ‌స‌రం. చ‌రిత్రే అన‌వ‌స‌రం అని మ‌న జీవితాల్లోంచి చారిత్ర‌క అవ‌గాహ‌ననే చెరిపేస్తున్న ఈ కాలంలో చ‌రిత్ర‌కి, స‌మ‌కాలీన సామాజిక జాడ్యాల‌కి ఉన్న సంబంధాన్ని నిజాయితీగా నిక్క‌చ్చిగా, క‌వితాత్మ‌కంగా ఆవిష్క‌రించిన చిత్రం మీ కంచె. ప్రేక్ష‌కుడు అన్ని సినిమాల‌కీ ఎంట‌ర్ టైన్మెంట్ (కామెడీ + గ్లామ‌ర్ + హింస‌) కోస‌మే రాడు. అన్ని ర‌సాలు అర్ధ‌వంతంగా క‌ల‌బోసిన జీవితానుభవం కోసం వ‌స్తాడు. వినోదం మాత్రమే కావాల్సిన‌వాడు వెళ్ల‌డానికి ఈ రోజుల్లో చాలానే ప్ర‌దేశాలున్నాయి.

కానీ సినిమాల్లో నిజ‌మైన జీవితానుభ‌వం కోరుకుని అందులోని త్రుప్తిని ఆస్వాదించాల‌నుకునే ప్రేక్ష‌కులు చాలా మందే ఉన్నారు. రోజు రోజుకీ పెరుగుతున్నారు. అలాంటి వాళ్ల‌కి కంచె ఒక స్వ‌చ్ఛ‌మైన అనుభ‌వం. మంచి సినిమాలు తీయ‌డం ద‌ర్శ‌కుల బాధ్య‌త అని భావించే ప్ర‌తి ఒక్క‌రికీ మంచి సినిమా చూడాల్సిన బాధ్య‌త కూడా ఉంటుంది. కంచె సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా కూడా చాలా మంచి ఫ‌లితాలు సాధిస్తోంద‌ని తెల‌సి ఎంతో ఆనందించాను. ఉన్న‌త‌మైన క‌ళ ద్వారానే ఉన్న‌తులైన ప్రేక్ష‌కుడు పుడ‌తారు. ఎన్నో అవ‌రోధాల‌ని అధిగ‌మిస్తూ వ‌చ్చిన మీ కంచె మ‌రింత బ‌ల‌ప‌డి మీ నుంచి నాలాంటి ప్రేక్ష‌కులు కోరుకుంటున్న మ‌రెన్నో ఉత్క్రుష్ట‌మైన చిత్రాల‌కి మార్గం సుగ‌మం చేయాల‌ని మ‌న‌సారా కోరుకుంటూ…

మోహ‌న్ క్రిష్ణ ఇంద్ర‌గంటి

Filed Under: Featuredకంచె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *