మనిషికో మాట .. గొడ్డుకో దెబ్బ

అక్బరుఫాదుషా సన్నిధికి ఒకనాడు నలుగు నేరస్థులను విరిచికట్టి తీసుకువచ్చారు భటులు. అందులో మొదటివాణ్ణి పిలిచి, చక్రవర్తి, “ఇది నీకు యోగ్యమైన పని కాదు సుమా !” అని మృదువుగా చెప్పి విడిచిపుచ్చాడు. రెండవవణ్ణి గట్టిగా చీవాట్లుపెట్టి మందలించి, పంపివేసాడు. మూడోవాణ్ణి భటులచేత బలవంతంగా బయటకు నెట్టింపించాడు.

ఇక నాలుగోవాడికి చుప్పనాతికిమల్లే ముక్కూ, చెవులూ చెక్కించి, తల గొరిగించి సున్నపుబొట్లు పెట్టి, గాడిదమీద ఊరేగించవలసిందని కఠినంగా అజ్ఞాపించాడు చక్రవర్తి.

ఈ తీర్పు విని సభాసదులు ఒకరిమొహం ఓకరు చూసుకొని, గుసగుసలాడుకోసాగారు. ఆరితేరిన న్యాయమూర్తులు సైతం తెల్ల మొహాలేసారు.

“ఏం నేర్పు, ఏంతీర్పు ! ఏంసబబు, ఏం న్యాయం !!” అని నలుగురూ నాలుగు విధాల అనుకున్నారు. “మా తీర్పులో మీకేమైనా సందేహాలు ఉంటే, ఉన్నదున్నట్లు చెప్పవచ్చు. ఎంత మాత్రం బిడియపడకండి” అని అభయమిస్తూ ప్రకటించాడు చక్రవర్తి.

అప్పుడు వారందరూ చక్రవర్తి ఎదుట చేతులు జోడించి వినయవిధేయలతో “ధర్మ మూర్తీ ! తమ న్యాయాన్ని మేము శంకించటం లేదు. కాని నలుగురూ ఒకే మోస్తరు నేరస్థులు కదా, ఈ నలుగురికి శిక్ష నాలుగు విధాలుగా ఎందుకున్నదో అనే విషయం మేం గ్రహించుకో లేకపోతున్నాం” అని మనవి చేసుకున్నారు.

ఆ నేరస్థుల వెనుక ఇద్దరేసి గూఢచారులను ఏర్పాటుచేసి, ఏం జరుగుతుందో వచ్చి చెప్పమన్నాడు అందరి ఎదుటా, చక్రవరి.

వెళ్ళిన గూఢాచారులు మూడవరోజున వచ్చి న్యాయస్థానంలో హాజరయ్యారు. వాళ్ళు తెచ్చిన సమాచారం వినటానికి సభికులందరూ కుతూహలపడుతున్నారు. అప్పుడు గూఢాచారుల నాయకుడు ప్రభువుకు ఇలా మనవిచేశాడు.

“ప్రభూ! మంచి మాటలతో మందలించి విడిచిపుచ్చిన మొదటివాడు గౌరవహాని భరించలేక ఇంటికి వెళుతూనే విషం త్రాగి మరణించడానికి ప్రయత్నం చేసాడు. మేము వాడిని వారించి బ్రతికించాం.

గట్టిగా చీవాట్లు తిన్నవాడు రెండవ వాడు ఇల్లూ వాకీలీ –తుదకు నగరం కూడా విడిచి పరారీ అయ్యాడు.

చెప్పుదెబ్బలు తిన్న నేరస్థుడు నాటినుండి పదిమందిలోకి రావటమే మానుకొని, ఉన్నాడా లేడా అన్నట్టుగా కాలక్షేపం చేస్తూ వున్నాడు.

పోతే, ఇక నాలుగవ వాడి సంగతి — అంటే ముక్కూ చెవులూ కోబబడ్డవాడి సంగతే చిత్రంగా వుంది గాడిద మీద ఊరేగింపు సంబరం జరుగుతూ వుంది. ప్రజలు గుపుగుంపులుగా మూగి వాడిని లేవిడి కొడుతున్నారు. ఆ సందడి చేసేఉందుకు వాడి పెళ్ళాంకూడా ఇంట్లోనించి ఇవతలకు వచ్చింది. ఆమెను తన దగ్గరికి రమ్మని పిలిచి, పదిమందీ విటూండగానే వాడు —

“త్వరగా ఇంటికి పోయి స్నానానికి సిద్ధం చెయ్యి. ఏముంది? ఈ దుష్టుల గొడవ తీరి, ఊరేగింపు ఐపోగానే, కొంచెం సేపటిలోనే వొచ్చేస్తా!” అని అరుస్తు చెప్పాడు ”

నీచుడికి నీతి నియమాలుగాని, సిగ్గు బిడియాలుకాని ఉండవనటానికి వీడిని మించిన తార్కాణలేదు కదా! అని అందరూ ఆశ్చర్యపొయారు.

ఈ వృత్తాంతం విన్న సభవారు చక్రవర్తి న్యాయ కౌశలానికి, శిక్షా విధానానికి అబ్బురపడి, ఫాదుషాను వేనోళ్ళ కీర్తించారు.

Source: Chandamama

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: