మీకు చావు భయం వుందా?

destiny-of-life

పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదని తెలుసు. మరణం గురించి ఎప్పుడో ఈనాడు అంతర్యామిలో వచ్చిన కథ:

అది గౌతమ బుద్దుడు జీవించి వున్న కాలం. ఓ యువకుడు వ్యసనాలకు బానిసై తద్వార నేరాలకు పాల్పడి పాడైపోతుంటే కలత చెందిన కన్నతల్లి ఇరుగుపొరుగుల సలహా మేరకు బుద్ద భగవానుని దర్శించుకొద్దామనుకుంది. అతికష్టం మీద కొడుకును ఆయన వద్దకు తీసుకెళ్ళింది.

అడవిలో ఏకాంతంగా ఓ చోట కూర్చునున్నాడు బుద్దుడు. దగ్గరికెళ్ళారిద్దరూ. ఆయన ముఖంలో చెప్పనలవికాని వెలుగు; కళ్ళనిండా అంతులేని జాలి, కొలతకందని ప్రమాణంలో ప్రేమ కనిపించాయి. ఒక్కసారిగా ఆయన పాదాలపై పడిపోయు కొడుకు గురించి చెప్పుకొని వలవలా ఏడ్చింది.

ఆ యువకుని ముఖంలొకి అలా చూసి “అమ్మా! ఇక ఇతని ఆయువు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది” అని చెప్పి పక్కకెళ్ళిపొయాడు బుద్దుడు. తల్లీ కొడుకులకు పిరాగిపొయినంత పనైంది. దిక్కుతోచలేదు. దిగాలుగా ఇంటి ముఖం పట్టారు. ఆ రాత్రి వాళ్ళిద్దరికీ నిద్ర పట్టలేదు. క్షణక్షణానికీ మృత్యువు దగ్గరవుతోందన్న భయంతో గడగడ లాడిపోయారు. అలా ఇరవై మూడు గంటలు గడిచిపోయాయి.

ఇంతలో బుద్దుడు అటువేపుగా వచ్చి తిన్నగా ఆ యువకుడున్న చోటి కెళ్ళి- “నిన్నట్నుంచి ఈ క్షణం వరకు అబద్దాలు చెప్పటం గాని, ఎవర్నయినా మోసగించటం గాని చేశావా ?” అనడిగాడు. లేదన్నట్టు ఆ యువకుడు తల అడ్డంగా వుపాడు. “దొంగతనం, వ్యభిచారం లాంటి పాపకార్యలేమైనా చేశావా?” అన్న బుద్దుడి ప్రశ్నకు “అసలా ఆలోచనే రాలేదు” అన్నాడతడు.

“మరెలాంటి ఆలోచనలొచ్చాయి ?”

“క్షణక్షణానికీ చావు దగ్గర పడుతుంటే .. ఎంతో విలువైన జీవితాన్నింత కాలంగా వృధా చేసుకున్నానో అన్న బాధ తప్ప మరో ఆలోచనే రాలేదు” చెప్పి బిగ్గరగా ఏడ్చాడు ఆ యువకుడు.

“బాదపడకు. నువ్విప్పుడు సరైన దారికొచ్చావు. ఇకముందు కూడా ఇదే ధ్యేయంతో ముందుకెళ్ళు. నీకు మృత్యువొచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరో జన్మ ఎత్తావు” అని బుద్దుడు చెప్పగా ఎనలేని ఆనందంతో తల్లీ తనయుడు ఆయన పాదాలపై పడ్డారు.

ప్రతి మనిషికి మరణం ఖాయం. అది ఎప్పుడైనా రావచ్చు. ఏ కారణంగానైనా రావచ్చు. ఏ రూపంలోనైనా రావచ్చు. కానీ మనిషి బ్రతికి వున్నంత కాలం మంచి ఆలోచనతో మంచి పనులే చేస్తూ మంచి మార్గాన పయనిస్తే అతనికిక చావు భయం వుండదు. ఆ వ్యక్తి చనిపోయిన జీవించి వున్నవాడితో సమానం.

Filed Under: Featured